Botsa Satya Narayana: ఏపీ కూటమి ప్రభుత్వం జగన్ కు భద్రత ఇవ్వడంలో విఫలం 1 y ago
ఏపీ : మాజీ సీఎం వైఎస్ జగన్ కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్య నారాయణ. జగన్ గుంటూరు పర్యటనలో ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించ లేదన్నారు. జెడ్ ప్లస్ భద్రతను పూర్తిగా తొలగించారని చెప్పారు. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ ఫిర్యాదుపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. తమ ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు.
జగన్ భద్రత పై తమకు ఆందోళన ఉందన్నారు. తమ ఆందోళనను గవర్నర్ కు తెలియజేశామన్నారు. జగన్ కు రక్షణ కల్పించాలని గవర్నర్‌ని కోరామన్నారు. ఆయన భద్రతకు ఎన్నికల కోడ్ కు సంబంధం లేదన్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి జెడ్ ప్లస్ భద్రత వెళ్లాలన్నారు. నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలని పేర్కొన్నారు.
మాజీ సీఎంగా జగన్ కు జెడ్ ప్లస్ భద్రత ఉంటుందన్నారు. వైసీపీ హయాంలో ప్రతిపక్షాలకు ఎక్కడైనా భద్రత తగ్గించామా అని ప్రశ్నించారు. జగన్‌ను ఇబ్బంది పెట్టేందుకే ఏకపక్షంగా భద్రత తగ్గిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం దురుద్దేశాలు తమకు తెలుసన్నారు. జగన్ కు భద్రత తొలగించడం మంచి పద్ధతి కాదన్నారు. మ్యూజికల్ నైట్ కు ఎన్నికల కోడ్ వర్తించదా అని ప్రశ్నించారు.